ఈ బస్సులో ఎక్కడికెళ్లినా రూపాయే చార్జీ!

Telugu

దక్షిణాసియాలోనే తొలిసారిగా బయో-గ్యాస్ ఇంధనంగా నడిచే బస్సును ఆవిష్కరించనున్నట్టు కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ ప్రకటించింది. ‘‘ఇటువంటి బస్సును ఆవిష్కరించడం ఆగ్నేయాసియాలోనే ఇది తొలిసారి. ఇప్పుడు 15-20 ఏళ్ల నాటి బస్సులకు కూడా ఈ చవకైన, పరిశుభ్రమైన ఇంధనంతో కొత్త జీవితాన్ని ఇస్తాం. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం’’ అని ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి ప్రకాశ్‌దాస్ తెలిపారు. ఈ నెలలో నాలుగు బస్సులు ప్రారంభిస్తామని, ఈ ఏడాది చివరి నాటికి మరో పది బస్సులను తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. 40 కిలోమీటర్ల వరకు దూరంతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి మాత్రమే చార్జీ కింద వసూలు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కోల్‌కతాలో అతి తక్కువ బస్సు టికెట్ ధర రూ.6 అని ఆయన పేర్కొన్నారు. తొలి బస్సును ఉల్టాదంగా-గరియా మధ్య 17 కిలోమీటర్ల పరిధిలో తిప్పుతామని తెలిపారు. ఇది ఆహ్వానించదగిన అభివృద్ధి అని పశ్చిమబెంగాల్ రవాణాశాఖా మంత్రి సువేందు అధికారి తెలిపారు. ఈ కంపెనీకి చట్టబద్ధంగా అన్ని పర్మిట్లు ఇస్తామని ఆయన తెలిపారు.

Share