శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్

పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు.

దత్తాత్రేయ ధ్యానమ్ :

జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి.

దత్తాత్రేయ వజ్రకవచమ్ :

ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.

Telugu
Share