గురువు

అతను యువకుడు, అతనికి అకస్మాత్తుగా సత్యాన్వేషణపైకి దృష్టి మళ్ళింది. సత్యాన్ని అన్వేషించాలన్న గురువు అవసరం అందుకని గురువుని అన్వేషించడానికి బయల్దేరాడు. గ్రామం పొలిమేరలో ఒక చెట్టు కింద సన్యాసి వుండడం చూశాడు. అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి ‘నువ్వు ఎన్నో ప్రదేశాలు తిరిగి వుంటావు, ఎంతో అనుభవాన్ని గడించి వుంటావు, నేను సత్యాన్వేషణలో వున్నాను, సరయిన గురువు లేకుండా నా జీవితం సంపూర్ణం కాదు దయచేసి గురువు గురించి చెప్పమని అడిగాడు. ఆ సన్యాసి గురువు రూపురేఖల్ని వర్ణించాడు, అట్లాంటి వ్యక్తి ఎక్కడైనా నీకు ఎదురయితే అతనే గురువు అన్నాడు. ఆ యువకుడు వృద్దుడికి కృతజ్ఞతలు చెప్పి అన్వేషిస్తూ సాగిపోయాడు. ముప్పయి సంవత్సరాలు గడిచిపోయాయి, అన్వేషణలో అలసిపోయాడు, వృద్దుడు చెప్పిన పోలికలున్న వ్యక్తి ఎక్కడా అతనికి తతస్దపడలేదు. బహుశా అట్లాంటి గురువు లేడేమో అనుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామాన్ని వదిలి వచ్చినప్పుడు వున్న సన్యాసి మరింత వృద్దుడయ్యాడు. అతన్ని చూసి యువకుడు నిర్ఘాంతపోయాడు ఆ సన్యాసి వర్ణించిన లక్షణాలన్నీ ఆ వృద్దుడిలోనే ఉన్నాయి, ఆవేశంతో దగ్గరికి వచ్చి ఎందుకు నన్ను మోసం చేశావు, నువ్వే గురువని చెప్పి ఉంటే ముప్పయి సంవత్సరాలు వృదా అయ్యేవికావు అన్నాడు. ముప్పయి సంవత్సరాల క్రితం నువ్వు యువకుడివి, ఆవేశంలో ఉన్నావు, నేనే గురువని చెప్పి ఉంటే నవ్వే వాడివి, హేళన చేసేవాడివి. అయినా నీకు వివరంగా చెప్పాను నువ్వు ఇక్కడ కాకుండా ఎక్కడో వెతుకుతున్నావు. ముప్పయి సంవత్సరాల నీ అన్వేషణ వ్యర్ధం కాలేదు, నన్ను గుర్తించావు, పైగా నాపై ఆరోపణలు చేస్తున్నావు, నా సంగతి ఆలోచించు నేను ఈ వృక్షాన్ని వదిలిపెట్టలేదు నీకోసం ఎదురు చూస్తున్నాను తప్పకుండా ఎదోఒకరోజు నువ్వు వస్తావని, నీకు చెప్పిన మాటల్లో అణువంతు అసత్యం లేదని గ్రహించు అన్నాడు. ఆ మాటలతో యువకుడికి జ్ఞానోదయమైంది.

Telugu
Share