ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ -రేవంత్

ప్రజాస్వామ్యానికి పునాది ప్రశ్నించే గొంతుక. ఆ గొంతు నులమడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. రాచరికానికి దారులు వేయడమే. నియంతృత్వాన్ని నెత్తికెక్కించుకోవడమే. మీ మూడున్నరేళ్ల పాలనలో తెలంగాణలో ప్రజల హక్కులు కాలరాయబడుతున్నాయి. వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. తప్పును ఎత్తిచూపే గొంతులను నొక్కివేసే ప్రయత్నం జరుగుతోంది. ఏ దళిత, గిరిజన, బలహీనవర్గాల ఆకాంక్షలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించిందో ఆ వర్గాల మనుగడే ఈ రాష్ట్రంలో, మీ పాలనలో ప్రమాదంలో పడుతున్నది. ప్రతిపక్ష సభ్యుల నుంచి ప్రశ్నించే సామాన్య గొంతుల వరకు ఏ వర్గాన్ని సహించే సహనం మీకు లేకుండా పోయింది. పత్రికల నుంచి పౌరుల హక్కుల వరకు...మానవ హక్కుల నుంచి వాక్ స్వాతంత్రం వరకు రాజ్యాంగం ఈ దేశ పౌరులకు సమున్నతంగా కల్పించిన ఏ ఒక్క హక్కు తెలంగాణలో వారికి దక్కడం లేదు. ఈ మూడేళ్లలో అనేక ఉందంతాలు దీనికి సాక్ష్యంగా నిలిచాయి. ఆర్మూర్ లో ఛైతన్యవంతమైన ఓ దళిత యువకుడుని మీ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు లారీతో తొక్కించి చంపితే అడిగే దిక్కులేదు. మీ అధికార దర్పంతో ఆ కేసును తెరమరుగు చేశారు. తాము ఆరుగాలం చెమటోడ్చి పండించిన మిర్చీ పంటకు మద్ధతు ధర కావాలని అడిగిన పాపానికి ఖమ్మం నడిబొడ్డున గిరిజన రైతులకు సంకెళ్లు వేసి నడి బజారులో నడిపించి అవమానించారు. వారు ఉగ్రవాదులైనట్టు, దేశద్రోహులన్నట్టు మీ సహచర మంత్రులు మాట్లాడి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. ఆ ఘటనకు బాధ్యులైన వారిపై వీసమెత్తు చర్యలకు కూడా మీరు సిద్ధపడలేదు. తన పాలిట యమదూతలుగా మారి, ప్రాణాలు తీస్తున్న ఇసుక లారీల పై మీ కుమారుడు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బాధితులు అనేక సార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో ఇసుకలారీ ఢీకొని ఓ గ్రామస్తుడు చనిపోయిన సందర్భంలో తాత్కాలిక ఆగ్రహావేశాలకు లోనై కొందరు గ్రామస్తులు లారీకి నిప్పుపెడితే మీకు పట్టరాని కోపం వచ్చింది. అన్యంపుణ్యం ఎరుగని దళిత, బలహీనవర్గాల యువకులను అన్యాయంగా తీసుకువెళ్లి పోలీసుల చేత చిత్రవధ చేయించారు. వారు తిరిగి మామూలు జీవితం గడలేని స్థాయిలో వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగింపజేశారు. మీ దృష్టిలో దళిత, బలహీనవర్గాల బిడ్డల ప్రాణాల కంటే మీ కుటుంబ సభ్యుల అక్రమ ఇసుక దందాకే ప్రాధాన్యత ఎక్కువైంది. ఇదే క్రమంలో తెలంగాణ కళాకారుడు, గాయకుడు, దళిత యువకుడు ఏపూరి *సోమన్న విషయంలో మీ కక్షపూరిత విధానాన్ని మరోసారి బయటపెట్టారు. తెలంగాణలో పాలన పేదలకు* *దూరమవుతుంటే, ఆ వర్గాల పట్ల పాలకులు నిర్దయగా వ్యవహరిస్తుంటే....ప్రభుత్వ* *కొలువును కాదనుకొని, పేదల గొంతుకగా మారడమే తన జీవితానికి సార్థకత అని సోమన్న గత రెండేళ్లుగా* *తెలంగాణ ప్రజలను ఛైతన్యపరిచే బృహత్తర బాధ్యతలను భుజాన వేసుకుని ఊరువాడా* *తిరుగుతున్నాడు్ దళిత వర్గాల అభ్యున్నతి దిశగా పాలకులలో మార్పు కోసం తన పాటతో ప్రశ్నిస్తున్నాడు. ఇది మీ* *ప్రభుత్వానికి కంఠగింపుగా మారింది. ప్రశ్నించే గొంతే ఉండకూడదన్న మీ నియంతృత్వ ధోరణికి* *అడ్డంకిగా మారింది. అందుకే సోమన్న గొంతు నులిమే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సోమన్న* *కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే...అవి చట్ట పరిధిలో* *పరిష్కరించ వలసిన విషయాలైతే దానికి ఓ మార్గం ఉంది. ఓ విధానం ఉంది. ఇలాంటి కేసుల్లో ఎలా* *వ్యవహరించాలో చట్టమే మార్గ నిర్థేశం చేస్తోంది. కానీ, సోమన్న పై ఇప్పటికే కక్షగట్టిన ప్రభుత్వం ఆయన* *కుటుంబ తగాదాలలో తల దూర్చి స్థానిక టీఆర్ఎస్ నేతల ద్వారా తనపై* *కక్షసాధించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. సోమన్న దేశద్రోహి అయినట్టు సంకెళ్లు వేసి,* *పోలీసు స్టేషన్ లో కఠిక నేలపై కూర్చొబెట్టాల్సిన అవసరం ఏమిటి? టీఆర్ఎస్* స్థానిక నేతలు *పోలీస్ స్టేషన్ లో ప్రైవేటు పంచాయితీ నిర్వహించడం దేనికి సంకేతం? పోలీసు* *స్టేషన్లను గడీలుగా మార్చి, దళితులు మీ బానిసలన్నట్టుగా పంచాయితీలు నిర్వహిస్తారా* ? సోమన్న *విషయంలో మీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపణీయం. ఇది* *ప్రజాస్వామ్య హక్కులు కాలరాయడమే. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం* *కల్పించిన ప్రాథమిక హక్కులు తెలంగాణకు వర్తించవన్న వికృత ధోరణి మీ చర్యలలో* కనిపిస్తోంది. *తక్షణం సోమన్న విషయంలో కక్షసాధింపు ధోరణిని ఆపాలి. ఓ దళిత యువకుడు* *విషయంలో అవమానపరిచేలా వ్యవహరించిన పోలీసు అధికారుల పై చర్యలు* *తీసుకోవాలి. అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసు స్టేషన్ లో ప్రైవేటు పంచాయితీకి* *సిద్ధపడిన టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్ లో* *దళిత, గిరిజన, బలహీనవర్గాల విషయంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం* *కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. మీ ఉదాసీనవైఖరి వల్లే ఎక్కడా జరగని విధంగా* తెలంగాణలోనే పదే పదే బడుగు, బలహీనవర్గాలు దగా పడుతున్నాయి. ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆయా వర్గాల విషయంలో జరుగుతోన్న దారుణాలపై దృష్టి సారించి, పునరావృతం కాకుండా చూడండి. మా డిమాండ్ కు స్పందించకుంటే...ఆయా వర్గాల తరపున అండగా నిలిచి, బలమైన పోరాటాలకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. అశేష జన ఆశీస్సులతో మీ పాలనకు చరమగీతం పాడే వరకు తెలుగుదేశం విశ్రమించబోదని హెచ్చరిస్తున్నాం

 

PoliticsImage: 
Share