ఉత్తరకొరియా వెనుక చైనానే ఉంది: ట్రంప్

వాషింగ్టన్: ఉత్తరకొరియా ఒక పనికి మాలిన దేశం. ఆ దేశ నాయకుడికి అమెరికా మీద కోపం. దాన్ని వివిధ సందర్భాల్లో రకరకాలుగా ప్రదర్శిస్తుంటాడు. అంతకంటే ఆ నాయకుడు చేయగలిగింది ఏమి లేదని ట్రంప్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ తీరుపై విరుచుకుపడ్డారు. ప్రపంచదేశాలన్నీ న్యూక్లియర్ ప్రయోగాలు వద్దని ఎంతగా చెబుతున్న కిమ్ వినే పరిస్థితుల్లో లేరని ట్రంప్ చెప్పారు. అంతేకాదు ఉత్తరకొరియా చర్చల ద్వారా దారి కొస్తుందని తాము కూడా ముందు ఆశించామని ట్రంప్ చెప్పారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చిచెప్పేశారు.

ఉత్తరకొరియా మరింతగా రెచ్చిపోతే చేయాల్సిన పని ఒక్కటేనని సైనిక చర్యపై ట్రంప్ చెప్పకనే చెప్పేశారు. మరోవైపు ఉత్తరకొరియాను చైనా ఉసిగొల్పుతుందని అందులో కొంతవరకు చైనా విజయం సాధించినట్టు కనిపిస్తుందని ఆయన అన్నారు. అయితే అది నిజమైన  విజయం కాదని ఆయన అంటున్నారు. నిజానికి చైనా తన దేశ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటుందని చైనా నమ్మి ఉత్తరకొరియా రెచ్చిపోతే నష్టపోయేది ఉత్తరకొరియానేనని ఆయన హెచ్చరిస్తున్నారు. ఉత్తరకొరియాను పావుగా వాడుకోవడం ఆపాలని ట్రంప్ చైనాను కోరారు. అమెరికా జాతీయ భద్రత సలహదారు హెర్బర్ రేమాండ్ మైక్ మాస్టర్ కూడా ఉత్తరకొరియాపై విరుచుకుపడ్డారు.

జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్లు కూడా ఉత్తరకొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలపై ఆందోళన వ్యక్తం చేశాయని ఆయన అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్ ఫోన్‌లో తనను సంప్రదించినట్లు ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ నియమాలను  ఉత్తరకొరియా ఉల్లఘించిందని వెంటనే ఐక్యరాజ్య సమితిలో ఈ విషయంపై చర్చ జరగాలని మెక్రాన్ అన్నారని మైక్ చెప్పారు. ఇలాగే ప్రతి దేశం అణ్వాయుధాలను ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తే మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతుందని మైక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరు మార్చుకోకపోతే ఉత్తరకొరియా ప్రపంచదేశాల నడుమ ఏకాకి అయ్యే ముప్పు పొంచి ఉందని మైక్ హెచ్చరించారు.

Share