కాకినాడ కోటపై దేశం జెండా

  • 32 చోట్ల టీడీపీ గెలుపు..మరో 3 రెబల్స్‌కు
  • 3 బీజేపీ సొంతం.. వైసీపీ10కి పరిమితం

కాకినాడ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పుష్కరకాలం తర్వాత జరిగిన కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. 48 డివిజన్లలో 32 గెలుచుకుంది. మరో 3 స్థానాల్లో మిత్రపక్షమైన బీజేపీ విజయం సాధించింది. వెరసి... టీడీపీ-బీజేపీ కలిసి 35 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశాయి. కాకినాడ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించాయి. విపక్ష వైసీపీ పది డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రె్‌సతోపాటు... బీఎస్పీ, సీపీఐ, సీపీఎం అభ్యర్థులకు ఒక్కటంటే ఒక్క డివిజన్‌లోనూ డిపాజిట్లు దక్కలేదు. కాకినాడ నగరంలో ఎన్నికలు జరిగిన 48 డివిజన్లలో టీడీపీ 39, బీజేపీ 9 డివిజన్లలో పోటీ చేశాయి. వైసీపీ సొంతంగా 48 డివిజన్లలో పోటీ చేసింది. ఆగస్టు 29న జరిగిన పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

శుక్రవారం ఉదయం ఈ ఓట్ల లెక్కింపు జరిగింది. కౌంటింగ్‌లో ఆది నుంచి టీడీపీ హవా కనిపించింది. తాను పోటీచేసిన 39 స్థానాల్లో ఏడు మాత్రమే కోల్పోయింది. బీజేపీ 9 డివిజన్లలో పోటీచేయగా... మూడు స్థానాలు దక్కించుకోగలిగింది. కమలం అభ్యర్థులు కోల్పోయిన ఆరులో... మూడు చోట్ల టీడీపీ రెబల్స్‌ గెలవడం గమనార్హం. మిగిలిన మూడు డివిజన్లను వైసీపీ దక్కించుకుంది. 9వ డివిజన్‌ నుంచి పోటీపడిన తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వై.మాల కొండయ్య కూడా గెలవలేకపోయారు. ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత వైసీపీలో చేరి పోటీ చేసిన కంపర రమేశ్‌ చేతిలో 553 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. మరోవైపు... 22వ డివిజన్‌ నుంచి పోటీచేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్న కుమారుడు శివ ప్రసాద్‌ ఓటమిపాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి 680 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మత్స్యకార ఓట్లు అధికంగా ఉన్న జగన్నాథపురం ప్రాంతంలో స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యే అన్న కుమారుడు ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది.

కాకినాడ ‘పుర’ ఎన్నికల్లో 12వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి తుమ్మల సునీత అత్యధికంగా 2229 ఓట్ల మెజార్టీ సాధించారు. ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీ కూడా టీడీపీ అభ్యర్థికే దక్కింది. 38వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన మాకినీడి శేషుకుమారి 20 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. టీడీపీ నుంచి గెలుపొందిన 32 మందిలో 27 మంది కొత్తవారే కావడం విశేషం. మిగిలిన ఐదుగురు గతంలో కార్పొరేటర్లుగా పనిచేశారు.

 

టీడీపీ మేయర్‌ అభ్యర్థుల విజయం

కాకినాడ మేయర్‌ పీఠం ఓసీ మహిళలకు రిజర్వు అయింది. ఈ పదవిని కాపులకే అప్పగిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముందే ప్రకటించారు. ఈ పీఠాన్ని ఆశించిన నలుగురు మహిళలూ గెలుపొందారు. 8, 28, 38, 40 డివిజన్ల నుంచి గెలిచిన అడ్డూరి వరలక్ష్మి, సుంకర పావని, మాకినీడి శేషుకుమారి, సుంకర శివప్రసన్నలలో ఎవరిని మేయర్‌ పీఠం వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వీరంతా మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ... అందరి కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉంది. మేయర్‌ పీఠంపై ‘అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తాం’ అని వీరంతా చెబుతున్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు సెప్టెంబరు 15 తర్వాత నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. డిప్యూటీ మేయర్‌ పదవిని బీసీ (మత్స్యకార) సామాజిక వర్గం వారికి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

PoliticsImage: 
chandrababu
Share